వైసీపీ నుంచి ఎప్పుడో బయటకు వచ్చా: మైసూరారెడ్డి
వైసీపీ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానని మాజీ ఎంపీ మైసూరా రెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమ జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, నీటి ప్రాజెక్టులతో రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని మైసూరా డిమాండే చేశారు. రాజకీయ లబ్ధి కోసమే రెండు రాష్ట్రాల నేతలు తిట్టుకుంటున్నారని, రాష్ట్రాలు విడిపోయినా విడదీయలేని సంబంధాలున్నాయి కాబట్టి, రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ తెలంగాణ, రాయలసీమకు మంచినీటి కోసం ఏర్పడిందని, శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తుంటే, ఏపీ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని మైసూరా ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం లేఖలు రాసి చేతులు దులుపుకుంటోందని, ఇపుడు కేంద్రం తెచ్చిన గెజిట్‌తో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.
రాయలసీమ ప్రాజెక్టులను జగన్ చిన్నచూపు చూస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించాలన్న జగన్... ఇప్పుడు ఎందుకు కల్పించడం లేదని మాజీ ఎంపీ మైసూరారెడ్డి ప్రశ్నించారు.