శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (10:43 IST)

వాతలు పెట్టినా బుద్ధిరావడం లేదు : చంద్రబాబుపై విజయసాయి ఫైర్

గత రెండేళ్ళలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు వాతలు పెట్టినా టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధిరావడం లేదంటూ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. నరసాపురం ఎంపీ రఘురామరాజు అరెస్టు వ్యవహారంపై నానా రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. 'కరోనా కట్టడి, చికిత్సకు రాష్ట్రం స్పందించిన తీరును ప్రధాని, కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రశంసించినా పచ్చ పార్టీ పెద్దలకు అరెస్ట్ గొడవ తప్ప మరేమీ పట్టడం లేదు. ప్రజల పట్ల ఏ బాధ్యత లేని మీకు రాజకీయాలెందుకు? రెండేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికలో వాతలు పెట్టినా బుద్ధి రాకపోతే మీ ఖర్మ!' అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 
 
అంతేకాదు, 'కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా హోరెత్తించిన అసత్యపు ప్రచారం ఈ ఏడాది ప్రపంచస్థాయి ‘పచ్చి అబద్ధాల’ పోటీలో ఫస్ట్ ప్రైజుకు ఎంపికైనట్టే. కొన్నేళ్లుగా ఈ పురస్కారం బాబు, పచ్చ పార్టీ ప్రముఖులకే దక్కుతుండటం తెలుగు ప్రజల గ్రహచారం' అంటూ విజయసాయి వివరుచుకుపడ్డారు.