శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (15:25 IST)

కరోనా కట్టడి చర్యల్లో సర్కారు విఫలం.. 3 గంటల్లో బెడ్డా.. ఎక్కడయ్యా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాపిస్తోంది. దీంతో ప్రతి రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ప్రటించింది. కానీ, విపక్షాలు మాత్రం కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు.
 
ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 25.9 శాతానికి చేరిందని.. ప్రభుత్వ అసమర్థ చర్యలతో ప్రజలు చనిపోతున్నారని మండిపడ్డారు. కరోనాకు సంబంధించి కోర్టులకు కూడా తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు.
 
'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చామని చెబుతున్నారు. అది అంతా అబద్ధం. ప్రభుత్వ జీవోలు ఎక్కడా అమలు కావట్లేదు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. అందరినీ కలుపుకొనిపోయి ప్రజల ప్రాణాలు కాపాడాలి. ప్రజల ప్రాణాలు హరించి శ్మశానాలకు రాజులుగా ఉండాలనుకుంటున్నారా? మిగతా రాష్ట్రాల కంటే ముందే ఏపీలో మద్యం దుకాణాలు తెరిచారు. థియేటర్లు, రెస్టారెంట్లు సహా అన్నీ తెరిచారు. మృతదేహాలను మోటార్‌ సైకిల్‌పై తీసుకెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇకపోతే, ‘రాష్ట్రంలో 3 గంటల్లో బెడ్‌ ఇస్తామని ప్రకటించారు. ఎక్కడైనా ఇస్తున్నారా? వెంటిలేటర్‌ బెడ్‌కు రూ.10 వేలు వసూలు చేయాల్సి ఉంటే.. రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు తెరవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విద్యార్థుల కారణంగా వారి ఇంట్లో వారి ప్రాణాలకూ వైరస్‌ ముప్పు పొంచి ఉంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? 
 
దేశమంతా పరీక్షలు వాయిదా వేస్తే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు. ఇప్పటికే పాఠశాలలు తెరిచి 130 మంది ఉపాధ్యాయులు చనిపోవటానికి కారణమయ్యారు. కొవిడ్‌లో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు కూడా ఎగ్గొట్టి వారిని విధుల నుంచి తొలగించారు. వ్యాక్సినేషన్‌లో కూడా రాష్ట్రం విఫలమైంది’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.