శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (14:54 IST)

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత, సినీ నటుడు ఎన్‌.శివప్రసాద్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
2009, 2014లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున ఆయన బరిలో దిగి విజయం సాధించారు. సినీరంగంలోనూ ఆయనకు ప్రవేశంముంది. కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. 
 
ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లోనూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో, ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వివిధ వేషాలతో తనదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు ఎంపీగా పార్లమెంటులోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వాణిని బలంగా వినిపించారు. 
 
ఈయన గతంలో సమాచారం, సాంస్కృతిక శాఖామంత్రిగా పని చేస్తున్నారు. 1999-2004 మధ్య ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు. 1999, 2014లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తనదైనశైలిలో పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. 
 
కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శివప్రసాద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రికెళ్లి పరామర్శించిన విషయం తెల్సిందే. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన పలు తెలుగు చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపును కూడా  సొంతం చేసుకున్నారు.