బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (08:53 IST)

నేటి నుంచి ఏపీలో కంటి వెలుగు పథకం

ఏపీలో నేటి నుంచి వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం ప్రారంభం కానుంది. అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.

కంటి వెలుగు కింద రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వైఎస్సార్‌ కంటి వెలుగులో భాగంగా మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబర్‌ 10 నుంచి 16 వరకు ఆరు పనిదినాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది.
 
రెండో దశలో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు విజన్‌ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్స చేస్తారు. కళ్లద్దాలు, క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు, ఇతర సేవలు ఉచితంగా అందిస్తారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.
 
160 మంది జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, 1,415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములవుతారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుకు నేత్ర పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపించారు.

42,360 మంది ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్‌ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు, నాలుగు, ఐదు, ఆరో దశల్లో కమ్యూనిటీ బేస్‌ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మొత్తం ఆరు దశల్లో మూడేళ్లపాటు అమలు చేస్తారు.