శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

సుఖశాంతులు ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నా.. గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ‌భూషణ్ హరిచందన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీవారి దర్శనార్ధం తిరుమల చేరుకున్న ఆయన తొలుత పద్మావతి అతిధి గృహానికి విచ్చేశారు. అనంతరం గవర్నర్ హరిచందన్ మహాద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనం అనంతరం రాష్ట్ర గవర్నర్‌కు రంగ నాయక మండపంలో అర్చక స్వాములు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి ఆశీర్వచనం అందించారు. ఆలయ ఆవరణలో గవర్నర్ పాత్రికేయులతో మాట్లాడుతూ భారతదేశం గొప్ప  ప్రజాస్వామ్య దేశమని, భారతదేశంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు.

శ్రీవారి దర్శనానంతరం గవర్నర్ పద్మావతి అతిధి గృహానికి చేరుకొని గురువారం సాయంత్రం తిరుమల నుండి రేణిగుంటకు బయలుదేరి వెళ్ళారు. కార్యక్రమంలో  తితిదే చైర్మన్ వై.వి.సుబ్బా రెడ్డి, ఈ.ఓ.అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈ.ఓ.ధర్మారెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.