శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (14:41 IST)

టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానంటే నేనే మాట్లాడతా? జీవీఎల్ నరసింహారావు

తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీలో విలీనం చేస్తానంటే తమ అగ్రనేతలతో తానే మాట్లాడుతానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత జీవీఎల్ నరసింహా రావు వెల్లడించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ భవిష్యత్ గురించి చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోందన్నారు. ఎందుకంటే, మాజీ మంత్రి చిదంబరం వంటి నేతను అరెస్టు చేయడంతో అవినీతిపరులకు ఇపుడు భయం పట్టుకుందన్నారు. 
 
ఇకపోతే, చంద్రబాబును బీజేపీకి దగ్గర చేస్తానని సుజనా చౌదరి చెప్పినట్లు తనకు తెలియదన్నారు. టీడీపీ నుంచి వచ్చిన సుజనాకు కొంత ఆ పార్టీపై అభిమానం ఉండొచ్చన్నారు. లేదంటే బీజేపీ, టీడీపీ కలిస్తే బాగుంటుందనే అభిప్రాయం కావొచ్చేమోనని చెప్పుకొచ్చారు. 
 
అయినా అన్నీ కోల్పోయిన టీడీపీతో కలవడం వల్ల బీజేపీకి నష్టమేనన్నారు. 'చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానంటే.. నేను కూడా మా అధిష్టానం నాయకులతో మాట్లాడతా'నని తెలిపారు. రాజధాని అంశంలో చంద్రబాబు ఐదేళ్లు అసత్యాలు చెప్పారన్నారు. గట్టిగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని దుయ్యబట్టారు. కేవలం గ్రాఫిక్స్‌తో మాయ చేశారని ధ్వజమెత్తారు. 
 
పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని బీజేపీ మొదటినుంచీ చెబుతున్నట్లు వెల్లడించారు. రూ.2,209 కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. కానీ ఆ అవినీతిపై ఎక్కడా చర్యలు ఎందుకు తీసుకోలేదో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అవినీతి అంశాలపై పుస్తకాలు ముద్రించారన్నారు. మరిప్పుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఎవరినీ అరెస్ట్ చేయలేదేంటని నిలదీశారు. 
 
రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయితే స్వాగతిస్తామన్నారు. కానీ పనులు బాగా ఆలస్యం అయితే అన్ని విధాలా నష్టం జరుగుతుందన్న సంగతి ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు. పోలవరం పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని వివరాలు అందలేదన్నారు. అందువల్లే కేంద్రం నుంచి నిధులు కేటాయింపు ఆలస్యం అవుతుందని ఓ ప్రశ్నకు జీవీఎల్ సమాధానమిచ్చారు.