మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:30 IST)

స్టీఫెన్ రవీంద్ర కోసం పట్టు... జగన్‌కు ఎందుకో అంత ఇష్టం!

తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కోసం ఏపీ ప్రభుత్వం గట్టిగా పట్టుబడుతోంది. ఆయన్ను ఏపీ రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా నియమించేందుకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 
 
రాష్ట్ర విభజన తర్వాత రవీంద్ర తెలంగాణకు పరిమితమయ్యారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఏపీకి తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించాలని జగన్ ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించిన జగన్.. స్టీఫెన్ రవీంద్రను తమకు ఇవ్వాలని అభ్యర్థించారు.
 
ఇందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణలో సెలవు పెట్టిన రవీంద్ర ఏపీకి వచ్చి కొన్నాళ్లపాటు అనధికారికంగా పనిచేశారు. ఆయనను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో తిరిగి తెలంగాణకు వెళ్లిపోయారు. 
 
తాజాగా, ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. స్టీఫెన్ రవీంద్ర విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. జగన్ అభ్యర్థనకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఆయనను రాష్ట్రానికి పంపాలని అభ్యర్థిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టీఫెన్ రవీంద్ర ఏపీకి రావడం ఖాయమేనని చెబుతున్నారు.