గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (09:23 IST)

ఏపీలో జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరు : ప్రశాంత్ కిషోర్

prashant kishore
రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోమారు పునరుద్ఘాటించారు. గతంలో కూడా ఛత్తీస్‍గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా ప్రజలకు డబ్బులను విచ్చలవిడిగా పంచిపెట్టారని, కానీ ఆ తర్వాతి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని గుర్తుచేశారు. అదేవిధంగా ఏపీ సీఎం జగన్ కూడా భారీగా డబ్బులు పంచినంత మాత్రాన ఆయన గెలుస్తారని అనుకోవడం పొరపాటే అవుతుందన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఛత్తీస్‌‍గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ లాగే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్‌లోనే జగన్ ఉండిపోయారు. ఒకప్పటి చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకా ఏం లేదు. ప్రజలకు నగదు బదిలీ చేశారు. కానీ, ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాభివృద్ధిని మరింత ఊతమిచ్చేందుకు ఏమీ చేయలేదు' అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల నిర్వహించిన ఓ సదస్సులోనూ జగన్ ఓటమి ఖాయమని పీకే చెప్పిన విషయం తెలిసిందే. 
 
ఇక జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ విజయావకాశాలపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ కలిపి మొత్తంగా 204 లోక్‌సభ స్థానాలుంటే 2014 లేదా 2019లో బీజేపీకి ఇక్కడ 50 సీట్లకు మించి సాధించలేదని గుర్తుచేశారు. 2014లో 29 చోట్ల, 2019లో 47 స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపొందిందన్నారు. ఏపీలో మాత్రం లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్న విషయం తెలిసిందే.