కుమారి పూజ చేయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (video)
నవరాత్రుల్లో రెండు రోజు కుమారి పూజ చేస్తారు. రెండు సంవత్సరాలున్న బాలికను కుమారి అని పిలుస్తారు. కుమారిని పూజిస్తే దారిద్య బాధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రెండు సంవత్సరాల బాలికను పూజించాలి.
2 నుంచి 10 సంవత్సరాలలోపున్న బాలికలకు మాత్రమే కుమారి పూజ చేయాలి. తర్వాత బాలికను పీటపైన కూర్చోబెట్టి.. పాదాలను నీళ్లతో కడగాలి. ఆ తర్వాత కాళ్లకు పసుపు రాయాలి. పాదాలపై పూలు చల్లాలి. సుగంధ ద్రవ్యాలను బాలికకు పూయాలి.
కర్పూర హారతి ఇవ్వాలి. ఆ తర్వాత బాలికకు కొత్త వస్త్రాలు ఇవ్వాలి. చివరగా అన్ని రకాల ఆహార పదార్థాలతో భోజనం తినిపించాలి. ఆ బాలికను సాక్షత్తూ బాల త్రిపురసుందరీ దేవి స్వరూపంగా భావించాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి.. అష్టఐశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. నవరాత్రుల్లో ఏ రోజైనా సరే.. కుమారి పూజ నిర్వహించుకోవచ్చు.
అలాంటి మహిమాన్వితమైన కుమారి పూజను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహించారు. తన మనవరాలికి కుమారి పూజ చేయించారు. తద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ఆశిస్తున్నారు. శుక్రవారం రాజరాజేశ్వరి అమ్మ వారి సన్నిధిలో తన మనవరాలైన సంయుక్తకు కుమారి పూజ నిర్వహించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కుమారి పూజ చేయించిన తన మనవరాలు సంయుక్త పాదాలను నమస్కరించారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అనుగ్రహం కోసం ఈ పూజ చేసినట్లు వెల్లడించారు.
కుమారి పూజ అనేది యువతులను సజీవ దేవతలుగా పూజించే గౌరవప్రదమైన ఆచారం. ఈ ఆచారం మహిళల పట్ల సాంస్కృతిక గౌరవాన్ని నొక్కి చెబుతుంది.