మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (10:31 IST)

రాజకీయ సర్వేలకు దూరంగా ఉంటా.. లగడపాటి రాజగోపాల్

రాజకీయ సన్యాసంతో ఇప్పుడు లగడపాటి రాజగోపాల్‌ను అందరూ మర్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉన్నట్టుండి విజయవాడలో ఓటేస్తూ కనిపించారు. ఆయనను చూసి మీడియా ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై స్పందించాలని అడగడంతో తనదైన శైలిలో కామెంట్లు చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్‌ రాజకీయ శైలిని అభినందించారు. ఓడినా ప్రజలను అంటి పెట్టుకుని ఉండటం అభినందనీయమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా.. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు.
 
ఇక సీఎం జగన్ గురించి కూడా ప్రస్తావించారు. వైసీపీ పాలన ఎలా ఉందో మరో మూడేళ్ల తర్వాతే తెలుస్తుందని అన్నారు. రాజకీయాలకు ముందు నుంచే వైఎస్ జగన్‌తో స్నేహం ఉందని చెప్పారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా లగడపాటి స్పందించారు. పోటీ వల్లే సంక్షేమానికి పార్టీలు పెద్ద పీట వేస్తున్నాయని లగడపాటి అభిప్రాయపడ్డారు. 
 
అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయాలని సూచించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమంగా ఉండేవని లగడపాటి గుర్తు చేశారు. ప్రభుత్వాలు తమ అవసరాల మేరకు సంక్షేమం, అభివృద్ధిలో దేనికి ఎక్కువ కేటాయించాలో నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. తన రాజకీయ జీవితం, సర్వేలపై స్పందించారు లగడపాటి. ఇకముందు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ రాబోనని తేల్చి చెప్పేశారు. రాజకీయ సర్వేలకు కూడా దూరంగానే ఉంటానని స్పష్టం చేశారు.