సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 18 నవంబరు 2021 (15:44 IST)

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో సునీత టచ్‌లో... సిబిఐకి లేఖ‌!

వైయస్‌. వివేకానందరెడ్డి హత్య కేసులో కొన్ని కోణాలపై విచారణ జరపాలని సీబీఐ డైరెక్టర్‌కు దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి లేఖ రాశారు. డ్రైవ‌రు దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మీడియాలో చర్చలు నడుస్తున్నాయ‌ని, అయితే, ఈ హత్యతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, నేను నిర్దోషిని, నన్ను ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికిస్తున్నార‌ని దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి లేఖ రాశారు. 
 
 
వైయస్‌. వివేకానందరెడ్డి మరణం విషయం త‌న‌కు తెల్లవారుజామన తెలిసింద‌ని, ఆ సమయంలో హైదరాబాద్‌లో వివేకానందరెడ్డి బావ మరిది ద్వారా త‌న‌కూ ఆ వార్త తెలిసింద‌ని దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏర్పాటైన సిట్‌ పలుమార్లు త‌న‌ను విచారించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
 

2019 మార్చి నెలలో వారం రోజులపాటు త‌న‌పై విచారణ చేశార‌ని, ఆ విచార‌ణ సమయంలో త‌న‌ను తీవ్రంగా హింసించార‌ని తెలిపారు. మళ్లీ 2019 నవంబర్‌లో త‌న‌ను విచారించార‌ని, ఈ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత కూడా మరో మూడు సార్లు త‌న‌పై విచారణ చేశార‌ని తెలిపారు. ప్రతిసారి తాను విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నాన‌ని, తెలిసిన విషయాలన్నీ చెప్పాన‌ని పేర్కొన్నారు. 
 

వైయస్‌. వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఆయన కుమార్తె వైయస్‌.సునీత ప్రతిరోజూ మీడియతో టచ్‌లోనే ఉంటున్నార‌ని, దురుద్దేశాలను ఆపాదిస్తూ, పత్రికా ప్రకటనలు చేస్తున్నార‌ని ఆరోపించారు. దర్యాప్తు అధికారులను కలుస్తూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ దురుద్దేశాలను ఆపాదిస్తూ పిటిషన్లు ఇస్తున్నార‌ని చెప్పారు. 
 
 
దర్యాప్తు సరైన మార్గంలో నడుస్తుందనుకుంటున్న సమయంలో వివేకా కుమార్తె సునీత మీడియా ముందుకు వచ్చి తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చార‌ని, దర్యాప్తు  సంస్థలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించార‌ని చెప్పారు. ఆమె ఇష్టాయిష్టాల ప్రకారం.. అమాయకులైన వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ, నిందలు మోపార‌ని, వైయస్‌.సునీత లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై ఓ వర్గం మీడియా పథకం ప్రకారం ప్రచారం చేసింద‌న్నారు. 
 

ఏబీఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో సునీత నిరంతరం టచ్‌లో ఉన్నార‌ని, 
ఇదే ఛానల్, పత్రిక వైయస్సార్‌ కాంగ్రెస్‌పైన, అమాయకులపైన నిరంతరం దుష్ప్రచారం చేసింద‌న్నారు. కారణాలేంటో తెలియదుగాని సునీత వ్యవహారం భిన్నంగా ఉంద‌ని, వివేకా భౌతిక కాయం దగ్గర దొరికిన లేఖ వ్యవహారంలో వైయస్‌.సునీత, ఆమె భర్త ఎన్‌.రాజశేఖర్‌రెడ్డితో పాటు,  ఎన్‌. శివప్రకాష్ రెడ్డి వ్యవహార శైలి అసహజంగా ఉంద‌న్నారు. ఇది చాలా అనుమానాలను రేకెత్తిస్తోంద‌ని, వివేకా హత్య ఘటనలో దాగి ఉన్న వ్యక్తులను బయటకు తీయాల‌ని, వారు చాలా క్రూరుల‌ని, నిజాలను వెలికి తీయాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. 
 
 
దర్యాప్తు సక్రమంగా, సజావుగా, నిష్పక్షపాతంగా జరగాల‌ని, లేకపోతే హంతకులు తప్పించుకుని, అమాయకులు బలి అవుతార‌న్నారు. వివేకాతో ఫోన్‌లోని డేటాను, సమాచారాన్ని వారు టాంపర్ చేసి, డిలీట్‌ చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలకు ఇచ్చారా? అనే అంశాన్ని తేల్చాల‌ని, ఎర్రగంగిరెడ్డి ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు? ఎవరు చెప్తే ఆయన అక్కడకు వచ్చారు? ఆయనతో టచ్‌లో ఉన్న వివేకా కుటుంబ సభ్యులు ఎవరు? ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని, వీడియో తీయాలని ఆదేశాలు ఇచ్చిన ఇనాయతుల్లాకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? పీఏ మూలి వెంకట కృష్ణా రెడ్డి మొబైల్ ఫోన్, వివేకా రాసినట్టుగా చెప్తున్న లేఖను ఎందుకు దాచిపెట్టారు? దీనిపై నిజాలు రాబట్టాల‌ని లోఖ‌లో పేర్కొన్నారు. 
 

వివేకా కుమార్తె సునీత పదేపదే సీబీఐ అధికారులతో సమావేశమయ్యారు. ప్రతి వారం వారితో సమావేశాలు జరిపారు? ఇన్ని సార్లు కలవడం వెనుక కారణం ఏంటి? ఇది సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయడం కాదా? తాను అనుకున్నట్టుగా దర్యాప్తును జరపడం లేదా? ఇంటరాగేషన్‌ లేకుండా, దస్తగిరికి కేవలం ఐదు రోజుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు అయ్యింది. సునీత భర్తే లాయర్‌ను పెట్టి ఆయనకు బెయిల్‌ ఇప్పించాడు. తన తండ్రిని చంపిన వ్యక్తికి సునీత, ఆమె భర్త ఎందుకు సహాయపడుతున్నారు? అని దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి ప్ర‌శ్నించారు.
 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వివేకా హత్య జరిగింది. 40 ఏళ్లుగా వైయస్సార్‌ కుటుంబానికి పులివెందుల పెట్టనికోటలా ఉంది. వివేకాను తొలగించుకోవడం ద్వారా పార్టీని పెంచుకోవాలనే ఆలోచన చేసి ఉండరా? ఈప్రశ్నకు దర్యాప్తు ద్వారా సమాధానం రాబట్టాలి. వివేకా హత్యకు కొన్ని వారాల ముందు బిటెక్‌.రవి, ఆదినారాయణరెడ్డి ఇతరులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తర్వాత వారు విజయవాడలో ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడే కుట్రపన్నారు. బిటెక్‌.రవి, ఆదినారాయణరెడ్డి, అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబి వెంకటేశ్వర్రావుతో సమావేశమయ్యారు. మొత్తం కుట్ర అక్కడే జరిగింద‌ని అనుమానాలు వ్య‌క్తం చేశారు.
 

పరమేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా జాయిన్‌ అయ్యారు. తర్వాత ఆస్పత్రిలో ఎవరికీ చెప్పకుండా వచ్చేశారు. ఆతర్వాత బీటెక్‌ రవితో సమావేశమయ్యాడు. వివేకా హత్యకు ముందు రోజు మార్చి, 14, 2019న కడప హరిత హోటల్‌లో వీరిద్దరూ మాట్లాడుకున్నారు. దీనిపై దర్యాప్తు చేయాలి. తర్వాత చంద్రబాబు, వివేకా హత్యను తన రాజీకీయ ప్రచారంగా వాడుకున్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఘటన గురించే ప్రచారం చేశారు. వివేకా హత్య.. టీడీపీకి అడ్వాంటేజ్‌. ఈ కోణంలో సీబీఐ విచారణ చేయాల‌ని డిమాండు చేశారు.
 

2016 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిపై బీటెక్‌ రవి గెలుపొందారు. వివేకానందరెడ్డి వల్ల బీటెక్‌ రవి రాజకీయ జీవితానికి అడ్డుపడే అవకాశాలున్నాయి. ఈ కోణంలోకూడా విచారణ చేయాల‌న్నారు. వివేకా ప్రాణాలకు ముప్పుందని తెలిసినా టీడీపీ గన్‌మ్యాన్‌ను ఎందుకు తొలగించింది? అతన్ని హత్య చేయాలనే ఉద్దేశంతోనే తొలగించారా? వివేకాను తొలగించాలని బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి కుట్ర చేశారు. పులివెందుల, కడప ప్రాంతాల్లో రాజకీయ స్వలాభం కోసమే ఈ పనికి పాల్పడ్డార‌ని, వివేకా హత్య వెనుక చంద్రబాబు, ఏబి.వెంక‌టేశ్వర్రావు, బి.టెక్‌.రవి, ఆదినారాయణ రెడ్డిల కుట్ర కోణంపై విచారణ చేయాల‌ని సిబిఐని కోరారు.