సీఎం జగన్ తరఫున... ‘సిరివెన్నెల’ పార్దివ దేహానికి మంత్రి పేర్ని నాని నివాళి
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున, ఆంధ్రప్రదేశం రాష్ట్ర ప్రభుత్వం తరఫున, సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో సీతారామశాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. అక్కడకి ప్రభుత్వ ప్రతినిధిగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి మంత్రి పేర్ని నాని వెళ్లారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం పేర్నినాని త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు, సిరివెన్నెల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని ఓదార్చి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి జగన్ మాటగా వారికి చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ, తెలుగు అక్షరాలు 56. తెలుగు నేర్చిన ప్రతి వాడికీ అవే మూలం. అలాంటి అక్షరాలతో పద విన్యాసం చేసి, ప్రతి తెలుగువాడి మదిలో చెరగని ముద్రవేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు జాతి గర్వపడేలా తన కలాన్ని కదిలించిన గీత రచయిత, సాహితీకారుడు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తరపున ఘన నివాళి అర్పిస్తున్నాం. సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని నివాళి అర్పించారు.