శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (12:57 IST)

మంగళగిరికి వస్తే సొంతూరుకు వచ్చిన భావన కలుగుతుంది : నారా బ్రాహ్మణి

nara brahmani
గుంటూరు జిల్లా మంగళగిరికి వస్తే సొంతూకు వచ్చిన భావన కలుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె శనివారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. టాటా తనేరా సీఈవో అంబూజ నారాయణతో కలిసి ఆమె మంగళగిరిలో వీవర్‌శాలను ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ... మంగళగిరి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేతలకు శిక్షణ, మార్కెటింగ్‌కు టాటా గ్రూప్ ముందుకొచ్చిందన్నారు. మంగళగిరి చేనేత కార్మికులకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు.
 
మంగళగిరి పేరు చెబితే చేనేత చీరలు గుర్తొస్తాయని, ఇక్కడికి వస్తే సొంత ఊరు వచ్చిన భావన కలుగుతుందని బ్రాహ్మణి పేర్కొన్నారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన వీవర్ శాలను ప్రారంభించిన నారా బ్రాహ్మణి, వీవర్ శాలలో ఏర్పాటు చేసిన అధునాతన మగ్గాలను, కుట్టు శిక్షణా కేంద్రాలను పరిశీలించారు.
 
చేనేత వృత్తికి గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కార్మికులు రెట్టింపు ఆదాయం పొందేందుకు సహకరిస్తామని బ్రాహ్మణి తెలిపారు. టీడీపీ ఎన్‌ఆర్‍‌ఐ విభాగం, చేనేత ప్రముఖులు, రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వీవర్‌శాలలో అధునాతన మగ్గాలతో సరికొత్త డిజైన్లతో వస్త్రాలను తయారుచేస్తారు. చేనేతలకు టెక్నాలజీ వినియోగంలో సహకరించేందుకు, వారు నేసిన చీరలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపుకు చెందిన తనేరా ముందుకొచ్చింది. మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు పొందేలా సహకరిస్తామని టాటా తనేరా సంస్థ సీఈవో అంబూజ నారాయణ తెలిపారు.