తాళిబొట్లు తెంపేస్తున్నారు... ఈ పాపం జగన్‌కు తగులుతుంది..
ఏపీ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్ ఎలా చనిపోయారో జగన్ తెలుసుకోవాలని నారా లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో అనుమానాస్పదస్థతిలో మృతిచెందిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 'రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు.. తాళిబొట్లు తెంపేస్తున్నారు. 13 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు. పట్టాభిపై దాడి చేశారు.. అచ్చెన్నపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు.
గొల్లలగుంట శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వ హత్య. ఈ పాపం జగన్‌కు తగులుతుంది. ఈ పోరాటం టీడీపీ, వైసీపీ మధ్య కాదు.. అంబేద్కర్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగానికి మధ్య పోరాటం. డీజీపీ వైసీపీ కండువా కప్పుకున్నారు. శ్రీనివాసరెడ్డి హత్యకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేయాలి' అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.