1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (12:59 IST)

వడ్డీ డబ్బులు చెల్లించలేదని వ్యక్తిపై కత్తితో వైకాపా కార్యకర్త దాడి

knife
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలు నానాటికీ శృతిమించిపోతున్నాయి. తీసుకున్న అప్పుకు వడ్డీ డబ్బులు చెల్లించకపోవడంతో ఓ వ్యక్తితో వైకాపా నేత ఒకరు పట్టపగలు, అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కావలి పట్టణంలోని ఉదయగిరి వంతెన వద్ద టీ బంకులో పనిచేసే మేడికొండ మాల్యాద్రి ఇంటి నిర్మాణం కోసం వైకాపా వార్డు నేత వేముల రాబర్ట్ వద్ద రూ.30,000 అప్పు తీసుకున్నారు. ఇందుకోసం ఆయన నెలకు రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు. నెలకు రూ.3 వేలు వడ్డీ చెల్లిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో వడ్డీ చెల్లించడంలో ఓ నెల ఆలస్యమైంది. దీంతో ఆగ్రహించిన వైకాపా నేత... మాల్యాద్రి వద్దకు శాంతి అనే యువకుడిని పంపించాడు. వచ్చే నెలలో వడ్డీ చెల్లిస్తానని మాల్యాద్రి చెబుతుండగా శాంతి ఆయనను కొట్టాడు. పైగా తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి దిగాడు. మాల్యాద్రి తప్పుకోవడంతో దవడ కింది భాగంలో గాయమైంది. ఈలోపు నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలియగానే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాధితుడు మాల్యాద్రిని పరామర్శించారు. నిందితుడు వైకాపా సానుభూతిపరుడుకావడంతో పోలీసు కేసు లేకుండా రాజీ చేసుకోవాలని సూచించారు. అందుకు అంగీకరించని మల్యాద్రి కేసు నమోదు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీనిపై పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు.