ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (21:17 IST)

పరీక్షా కేంద్రంలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే: మంత్రి ఆదిమూలపు

రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, కోవిడ్ 19 నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్హహించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

విజయవాడలోని సమగ్ర శిక్షా కార్యాలయం లో మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పరీక్షా కేంద్రంలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండే విదంగా చర్యలు తీసుంటామన్నారు.

దీనివల్ల గతంలో అనుకున్న 2882 పరీక్షా కేంద్రాలకు 44 శాతం అదనంగా అంటే మొత్తం 4154 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి గదిలో మాస్క్ లు, శానిటైజర్లు అందుబాటులో ఉంటాయన్నారు. దాదాపు 8 లక్షల మాస్క్ లు విద్యార్థులకోసం సిద్ధం చేస్తున్నామన్నారు. టీచింగ్ స్టాఫ్ కు పరీక్షా కేంద్రాల్లో గ్లౌజు లు కూడా ఇస్తామన్నారు.

ప్రతి కేంద్రం లో ఒక ధర్మల్ స్కానర్ ఉండేవిధంగా దాదాపు 4500 స్కానర్ లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న కంటైన్మెంట్ జోన్ లలో పరీక్షా కేంద్రాలు లేవని, ఒకవేళ ఇప్పుడున్న కేంద్రాలవద్ద కొత్తగా కరోనా కేసులు వచ్చి అవి కంటైన్మెంట్ జోన్ ల లోకి వెళితే వాటికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధంగా ఉండేలా అధికారులను సమాయత్తం చేశామని మంత్రి తెలిపారు.

వీటితో పాటు ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా ఇదే తరహాలో అన్ని జాగ్రత్తలతో నిర్వహిస్తామన్నారు. గతంలో 580 పరీక్షా కేంద్రాలు ఉంటే వాటిని కూడా 1022 కేంద్రాలకు పెంచామన్నారు. 
 
జూలై ఆఖరుకు నాడు - నేడు తొలిదశ పూర్తి
నాడు - నేడు తొలిదశ పనులు జూలై ఆఖరుకు పూర్తి చేయాలని మంత్రి సురేష్ అధికారులను ఆదేశించారు. నాడు నేడు పనులపై సమీక్షించిన మంత్రి తొలిదశ ఎంపిక చేసిన 15, 175 పాఠశాలల్లో పనులు పూర్తి కి కావలసిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఎక్కడెక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించి పనుల వేగం పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశం లో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ చిన్నవీరభద్రుడు, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ సలహాదారు మురళి, పలువురు అధికారులు పాల్గొన్నారు.