21న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
కార్తీకమాసంలో శ్రవణానక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 21వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 20న పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది.
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు.
సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి. పూర్వపురోజుల్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది.
ఆ తరువాత నిలిచిపోయిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న టిటిడి పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తోంది.