బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated: మంగళవారం, 24 జనవరి 2023 (11:49 IST)

నరసరావుపేట ఎంపీ సీటును కడపోళ్లకు ఇస్తే ఓడిస్తాం : రాయపాటి

rayapati
నరసరావుపేట ఎంపీ సీటును కడపకు చెందిన వారికి ఇస్తే మాత్రం తప్పకుండా ఓడించి తీరుతామని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. తాడికొండ నియోజకవర్గ టీడీపీ నేత తోకల రాజవర్థన్ రావు ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలను సోమవారం గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో నిర్వహించారు. 
 
ఇందులో రాయపాటి సాంబశివరావు కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను పోటీ చేయడం లేదన్నారు. అయితే, మా కుటుంబం నుంచి పోటీ చేసేందుకు (కుమారుడు, కుమార్తె) రెండు సీట్లు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కోరినట్టు చెప్పారు. 
 
అలాగే, తాడికొండ సీటును తోకల రాజవర్థన్ రావుకు ఇవ్వాలని, ఆయన అక్కడ సులభంగా గెలుస్తారని చెప్పినట్టు తెలిపారు. నరసరావుపేట ఎంపీ సీటును మాత్రం కడపోళ్లకు ఇస్తే ఓడించి తీరుతామని, అవసరమైతే నేనే ఎంపీగా పోటీ చేస్తానని, నేను పోటీలోకి దిగితే వీళ్లు ఎవరూ పనికిరారని చెప్పారు. 
 
తన సీటు వేరే ఎవరికో ఇస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోం అని ఆయన చెప్పారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిదేనని రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.