బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (09:41 IST)

45 రోజుల వ్యవధిలో నలుగురిని ఆరుసార్లు కాటేసిన పాము

45 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఆరుసార్లు పాము కాటేసింది. వివరాల్లోకి వెళితే చంద్రగిరి మండలం దోర్నంకంబాల పంచాయతీ మల్లయ్యపల్లి ఆంధ్రవాడకు చెందిన వెంకటేష్, తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ అటవీప్రాంతం సమీపంలోని కొట్టంలో జీవనం సాగిస్తున్నారు.
 
ఇటీవల శనివారం రాత్రి జగదీష్ ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో అతడి కాలుపై పాము కాటేసింది. వెంటనే అతడిని కుటుంబీకులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. 
 
గతంలో వెంకటేష్‌ రెండు సార్లు, ఆయన తండ్రి, ఆయన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్ ఒక్కోసారి పాముకాటుకు గురయ్యారు. తాజాగా జగదీష్‌ను రెండోసారి పాము కాటేసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.