ఈ నెల 24న సొంతూరు పొన్నవరానికి సీజేఐ ఎన్వి రమణ
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తన స్వగ్రామం కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని పొన్నవరం రానున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక మొదటి సారి సొంత ఊరుకు ఆయన ఈ నెల 24న వస్తుండటంతో స్థానికులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
పొన్నవరంలో ఆయన 25న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 24 నుంచి 26 తేదీ వరకు సీజేఐ ఏపీలో ఉంటారు. 26న ఏపీ రాజధానికి వచ్చి, హైకోర్టు సందర్శనతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ నెల 26న జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారులు రెండో సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అదే రోజు ఏపీ హైకోర్టుకు వచ్చి, హైకోర్టు న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఏపీ హైకోర్టుకు రమణ రావడం ఇదే మొదటి సారి.