సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (11:22 IST)

దేశంలో 572 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతుంటే, ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ మాత్రం చాపకింద నీరులా వ్యాపిస్తుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,563 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ సోకడం వల్ల 132 మంది మృత్యువాతపడ్డారు. మరో 8,077 మంది ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 
 
తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య గత 572 రోజుల క్రితం నమోదైన కేసులతో సమానం కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 82,267 మంది హోం క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో 4,77,554 మంది చనిపోయారు. 
 
చాపకిందనీరులా ఒమిక్రాన్ వ్యాప్తి 
ప్రపంచాన్ని గడగడాలిడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ ఇపుడు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఫలితంగా దేశంలో మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 153కు చేరుకుంది. ఆదివారం మహారాష్ట్రలో ఆరు కేసులు, గుజరాత్‌లో నాలుగు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. వీటన్నింటితో కలుకుని ఈ కేసు సంఖ్య 153కు చేరింది. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోకి ఈ వైరస్ ప్రవేశించింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 54 కేసులు, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 14, తెలంగాణాలో 20, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో 11 చొప్పున, ఏపీ, చండీగఢ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. 
 
మరోవైపు, ఈ కొత్త వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. గతంలో బయటపడిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఎంతో వేగంగా వ్యాపిస్తుందని తెలిపింది. ఇప్పటికే 90కు పైగా దేశాల్లో ఈ వైరస్ వ్యాపించిన విషయం తెల్సిందే. 
 
మాస్కులు ధరించండి - బూస్టర్ వేయించుకోండి.. 
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ భయపెడుతోంది. ఈ వైరస్ ధాటికి అన్ని ప్రపంచ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తుంది. పాజిటివ్ కేసులు అమాంతం రెట్టింపు అవుతున్నాయి. 
 
దీంతో అమెరికాకు చెందిన అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ తమ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దని కోరారు. అలాగే, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని బూస్టర్ డోస్ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
చాపకిందనీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే 90 దేశాలకు చుట్టేసిందని గుర్తుచేశారు. అమెరికాలో సగానికి పైగా ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్ కారణంగా న్యూయార్క్‌లోని పాజిటివిటీ రేటు 8 శాతం దాటింది. అయితే, ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.