శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ

narayanap
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలంటూ ఏపీ సీఐడీ పోలీసులు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఆయన కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, ఈ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ రద్దు నిరాకరించింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములను చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అలాగే, ఏపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 
 
నారాయణ ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఏపీ వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు నారాయణకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయడానికి అంగీకరించలేదు. 
 
ఈ సందర్భంగా ప్రతి చిన్న విషయానికి సుప్రీంకోర్టు తలుపుడ తడితే ఎలా అంటూ ఏపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములను చేయొద్దని కూడా ఏపీ సర్కారుపై కోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.