1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Supreme Court agrees to transfer YS Viveka Murder Case CBI Probe to Other State

వివేకా హత్య కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ! శుక్రవారం తుది తీర్పు

viveka deadbody
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీత అపెక్స్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుధీర్ఘంగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 
 
ఆ సమయంలో సీబీఐ తరపున కూడా ఒక పిటిషన్ దాఖలైంది. వివేకా హత్య కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని సీబీఐ అధికారులు అందులో పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరిస్తామని తెలిపింది. 
 
తన తండ్రి హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సక్రమంగా జరగడం లేదని, కొందరు సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దర్యాప్తు అధికారులపై ప్రైవేట్ కేసులు పెడుతున్నారని, అందువల్ల సీబీఐ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దాదాపు మూడు గంటల పాటు విచారించింది. 
 
అదేసమయంలో వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని సుప్రింకోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్‌ను సీబీఐ దాఖలు చేసింది. విచారణను వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలనే బలమైన కారణాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది. దీంతో ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అపెక్స్ కోర్టు పచ్చజెండా ఊపింది. అయితే, ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అంశంపై శుక్రవారం తుది తీర్పును వెలువరించనుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మునుగోడును అమెరికా చేసి పారేద్దాం.. కేఏ పాల్