గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (06:10 IST)

ఏపీ రాజధానిపై కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా చౌదరి

ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని జగన్ సూచనప్రాయంగా తెలియజేశారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా స్పందించారు. 
 
రాజధానిగా అమరావతి ఇప్పటికే ఓ గుర్తింపు తెచ్చుకుందని, ఇప్పుడేదో జగన్ చిన్నపిల్లల ఆటలా రాజధానిని మార్చుతామంటే కుదరదని అన్నారు. ఏపీ రాజధానిని మార్చుతుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.

నాడు సచివాలయ ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారని, సీఎం జగన్ ఇష్టంవచ్చినట్టు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. సీఎం జగన్ వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని, రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.
 
జగన్‌కు ఓటు వేసి మోసపోయాం
వైఎస్ జగన్‌కు ఓటు వేసి మోసపోయామని వైసీపీ‌కి చెందిన రైతులు వాపోతున్నారు. తుళ్లూరులో రాజధాని రైతులతో సమావేశమైన వైసీపీ రైతులు రాష్ట్రం 3 రాజధానుల జగన్ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండేవిధంగా ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించారు.

శుక్రవారం నుంచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. కాగా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై కోస్తా, ఉత్తరాంధ్ర, రాయసీమలో భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. కొన్ని పార్టీలు, కొంతమంది నేతలు మద్దతిస్తుంటే.. మరికొన్ని పార్టీలు, మరికొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు.

కొన్ని చోట్ల విపక్ష పార్టీలు స్వాగతిస్తుంటే.. పలు చోట్ల సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. కానీ రాజధాని రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్త మవుతోంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ వినిపిస్తోంది.