శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 25 జూన్ 2020 (18:38 IST)

జూన్ 27 నుంచి ఎన్నివేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారో తెలుసా?

కరోనా వైరస్ కారణంగా సుమారు 80 రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్సనం భక్తులకు లభించలేదు. అయితే ఆ తరువాత భక్తులను దర్సనానికి అనుమతిస్తున్నారు కానీ పరిమితం సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి స్వామివారి దర్సనానికి సంబంధించిన టోకెన్లను జారీ చేయడం ప్రారంభించారు. 
 
11వ తేదీ భక్తులను దర్సనానికి అనుమతించారు. అయితే ప్రతిరోజు కేవలం 6వేల మంది మాత్రమే భక్తులు దర్సనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. సామాజిక దూరం పాటిస్తూ ఎలాంటి తోపులాటలు జరుగకుండా భక్తులు స్వామివారిని దర్సించుకున్నారు. అయితే సరిగ్గా వారంరోజుల క్రితం మరో 3వేల మంది అదనంగా స్వామివారిని దర్సించుకునేందుకు టిక్కెట్లను మంజూరు చేసింది టిటిడి.
 
ప్రస్తుతం మొత్తం ఒక రోజుకు 9వేల మంది భక్తులు స్వామివారిని దర్సించుకుంటున్నారు. 6వేల టిక్కెట్లను ఆన్లైన్ లోను, 3వేల టిక్కెట్లను ఆఫ్‌లైన్ లోను టిటిడి అందజేస్తోంది. అయితే రేపటి నుంచి మరో 3 వేల టిక్కెట్లను భక్తులను అదనంగా అందించేందుకు టిటిడి సిద్థమైంది. 
 
అంటే ప్రతిరోజు 12వేల మంది భక్తులు స్వామివారిని దర్సించుకోవచ్చు. అందులో 9వేల టిక్కెట్లను ఆన్లైన్‌లో భక్తులకు అందించనున్నారు. 3 వేల టిక్కెట్లను ఆఫ్‌లైన్‌లో ఇవ్వనున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద టోకెన్లను భక్తులకు అందజేయనున్నారు. ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. 
 
విడతల వారీగా అధికసంఖ్యలో భక్తులను దర్సనానికి పంపించే ప్రక్రియ కొనసాగిస్తామని ఇప్పటికే టిటిడి ఛైర్మన్ తెలిపారు. అందులో భాగంగా వారానికి 3 వేల మంది భక్తుల చొప్పున పెంచుకుంటూ పోతోంది టిటిడి. సాధారణస్థాయికి అంటే గతంలో ప్రతిరోజు 80 వేలమందికిపైగా భక్తులు స్వామివారిని దర్సించుకునేవారు. ఆ స్థాయికి రావాలంటే సమయం పట్టే అవకాశం ఉందని టిటిడి అధికారులు చెబుతున్నారు.