ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (09:08 IST)

తిరుమల క్యూలైన్లలో అకతాయిల ప్రాంక్ వీడియో... విచారణకు ఆదేశం

tirumala
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కొందరు అకతాయిలు ప్రాంక్ వీడియోలు చేశారు. శ్రీవారి భక్తులను ఆటపట్టిస్తూ ఈ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోలు ఇపుడు వైరల్ అయ్యాయి. శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులు వేచి ఉండే నారాయణగిరి షెడ్లలో ఇద్దరు తమిళనాడు యువకులు చేసిన ఈ ప్రాంక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి ఈ వీడియోను తీసినట్టు తెలుస్తోంది. 
 
భక్తులు వేచివున్న నారాయణగిరి షెడ్‌లలోని ఓ కంపార్టుమెంట్‌కు ఎప్పటిలానే టీటీడీ సిబ్బంది తాళాలు వేశారు. అయితే కంపార్టుమెంట్‌కు తాళాలు తీస్తున్నట్లు వాసన్ నటించాడు. దీంతో కంపార్టుమెంట్‌లో కూర్చుని ఉన్న భక్తులు టీటీడీ ఉద్యోగిగా భావించి దర్శనానికి పంపుతున్నారనే ఉద్దేశంతో ఒక్కసారిగా పైకి లేచారు. అంతలోనే వాసన్ వెకిలి నవ్వులతో అక్కడి నుంచి పరుగు తీశాడు. 
 
ఈ దృశ్యాలను అతని స్నేహితుడు సెల్ ఫోనులో చిత్రీకరించాడు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన పలువురు భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గురువారం వైరల్ కావడంతో విజిలెన్స్ విచారణకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. కాగా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తీసిన ప్రాంక్ వీడియో హేయమైన చర్య అంటూ టీటీడీ గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో ఖండించింది. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించింది.