శుక్రవారం, 7 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (17:02 IST)

చంద్రబాబు అరెస్టు చేసిన ఆరోజు, నేటితో రెండేళ్లు - కీలక మలుపు తిప్పిన ఘటన

babu arrest
ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సెప్టెంబరు 9వ తేదీకి రెండేళ్లు పూర్తయింది. గత వైకాపా ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో నైపుణ్యాభివృద్ధి సంస్థలో అవినీతి చోటు చేసుకుందని కేసు నమోదు చేసి 2023 సెప్టెంబరు 9వ తేదీన అరెస్టు చేశారు. నాడు చోటుచేసుకున్న ఈ పరిణామం ఆ తర్వాత రెండేళ్లలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది. 
 
ఆనాడు ఏం జరిగిందంటే.. 2023 సెప్టెంబరు నెల 8వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో 'బాబు ష్యూరిటీ - భవిష్యత్‌‌కు గ్యారెంటీ' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, రాత్రి తన బస్సులో విశ్రాంతి తీసుకుంటుండగా పోలీసులు భారీగా మోహరించారు. సెప్టెంబరు 9వ తేదీ తెల్లవారుజామున 6 గంటల సమయంలో అప్పటి సీఐడీ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలోని బృందం ఆయనను అరెస్టు చేసింది. అనంతరం సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపించారు.
 
టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే, ఈ ప్రాజెక్టు అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ కేసు విచారణలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారు. ఈ అరెస్టు రాజకీయ కక్షసాధింపు చర్యేనని టీడీపీ తీవ్రంగా ఆరోపించింది.
 
చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయనకు సంఘీభావం తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాజమహేంద్రవరం జైలు వద్ద టీడీపీతో పొత్తును ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో చేరడంతో మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి.
 
ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 చోట్ల జయకేతనం ఎగురవేసింది. 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. 
 
లోక్‌సభలోనూ కూటమి 21 స్థానాల్లో గెలుపొందగా, వైసీపీ నాలుగు స్థానాలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం అరెస్టుకు గురైన చంద్రబాబు, నేడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టడం ఈ ఘటనలో కీలకమైన రాజకీయ మలుపుగా నిలిచిపోయింది.