పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వైకాపా మాజీ నేత విజయసాయి రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పవన్‌ను ఎపుడూ కూడా పల్లెత్తు మాట అనలేదని చెప్పుకొచ్చారు. పైగా పవన్ తనకు 20 యేళ్లుగా మిత్రుడని ఆయనను తాను ఎన్నడూ విమర్శించలేదని భవిష్యత్‌లో కూడా విమర్శించబోనని అన్నారు. అలాగే, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఆదివారం శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి మాత్రం ఒక రైతుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ చేరి, ఆయనను తప్పుదార పట్టిస్తోందని ఆరోపించారు.
నిబద్ధత లేని వ్యక్తులను జగన్ నమ్మవద్దని హితవు పలికారు. వారి వల్లే తాను ప్రస్తుతం రాజకీయాలుకు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. అయితే, తనకు కొత్త రాజకీయ పార్టీని స్థాపించే ఆలోచన లేదా వేరే పార్టీలో చేరే ఉద్దేశంగానీ తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనపై అనేక ఒత్తిళ్లు వచ్చినా దేనికీ లొంగలేని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.