శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (08:56 IST)

సాధారణ ఓటరులా క్యూలో నిలబడి ఓటు వేసిన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం కడప జిల్లా పులివెందులలోని భాకరాంపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. జగన్‌తో పాటు ఆయన భార్య భారతి కూడా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
జగన్ వెళ్లే సమయానికే పోలింగ్ బూత్ వద్ద పలువురు ఓటర్లు ఉండటంతో, కాసేపు జగన్ దంపతులు క్యూలో నిలుచోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లు ఎలావున్నాయని ఓటర్లను జగన్ అడిగి తెలుసుకున్నారు. ప్రిసైడింగ్ అధికారులనూ పలకరించిన ఆయన, వారికి కల్పించిన సదుపాయాలపై ఆరా తీశారు. 
 
మరోవైపు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహం చూపుతున్నారు.
 
ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఓటు హక్కును వినియోగించుకోగా, సినీ పరిశ్రమ నుంచి కూడా చాలా మంది తరలి వస్తున్నారు. వీరిలో ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మరో హీరో అల్లు అర్జున్ కూడా ఓటు వేశారు.