శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (17:54 IST)

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమరం : 'ఉత్తరం'లో ఉత్కంఠ.. టీడీపీ వర్సెస్ బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పలు నియోజకవర్గాల్లో రసవత్తర పోటీ నెలకొంది. ముఖ్యంగా, విశాఖ జిల్లాలోని విశాక ఉత్తరం అసెంబ్లీ స్థానంలో గట్టి పోటీ ఏర్పడింది ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్ల విశాఖ ఉత్తర నియోజవర్గంలో బీజేపీకి అవకాశం దక్కింది. పి.విష్ణుకుమార్‌ రాజు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైసీపీ అభ్యర్థి చొక్కాకులపై విజయం సాధించారు. 
 
ఆ తర్వాత బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ పదవి సాధించి, అసెంబ్లీలో గళం వినిపించడం ద్వారా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో టీడీపీతో బంధం తెగిపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇది ఆయనకు మైనస్‌గా మారింది. ఇపుడు ఆయనే మళ్లీ ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. 
 
అయితే అధికార టీడీపీ నుంచి తాజా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనూహ్యంగా ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ప్రత్యర్థులకు మింగుడు పడలేదు. ఆయన్ను ఎదుర్కొనడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎన్నికలకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకువెళ్లే గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో అడుగుపెట్టిన వెంటనే పార్టీ శ్రేణులన్నింటినీ కూడగట్టారు. నార్త్‌ టిక్కెట్‌ ఆశించిన వారందరితో మాట్లాడి పార్టీలో తగిన స్థానం ఇస్తామని, పార్టీ విజయానికి, చంద్రబాబును మరోసారి సీఎంగా చేయడానికి సహకరించాలని కోరారు. 
 
పైగా, ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతున్నారు. విజయం ఖాయమని, మెజారిటీ పైనే దృష్టి పెట్టామని చెబుతున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి కేకే రాజుకు ఇదే రాజకీయ అరంగేట్రం. ఇద్దరు సీనియర్లతో ఆయన పోటీ పడుతున్నారు. జగన్‌ ఛరిస్మాతో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేస్తున్నారు. జనసేన పార్టీ పోటీలో ఉన్నప్పటికీ.. ఈ పోటీ మాత్రం నామమాత్రంగానే ఉంది.