సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (09:28 IST)

మంగళగిరి బరిలో నారా లోకేశ్...

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి ప్రకటించారు. మొత్తం 126 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన ఆయన.. 76 మంది సిట్టింగ్‌లకు మళ్లీ సీట్లు కేటాయించారు. ఈ జాబితాలో 33 మంది బీసీలకు, 21 మంది ఎస్సీ, ఎస్టీలకు చోటు కల్పించారు. ఈ తొలి జాబితాలోనే తన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు కూటా నియోజకవర్గం కేటాయించారు. ఆయన మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. 
 
నారా లోకేశ్, నిజానికి తొలుత భీమిలి నియోజకవర్గంలో పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రం మంగళగిరి టికెట్ కేటాయించింది. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని భావించిన నారా లోకేశ్ గురువారం వ్యూహాత్మకంగా ప్రచారం మొదలుపెట్టారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఎంతో చైతన్యం ఉన్న ఈ ప్రాంతంలో రాష్ట్ర రాజధాని రావడం అదృష్టమని లోకేశ్ అన్నారు. ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, తన ప్రచారంలో కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఏపీ నేతలపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తూ కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు.