సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (15:49 IST)

కడప లోక్‌సభ బరిలో వైఎస్ షర్మిల... వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదా?

ys sharmila
వైఎస్ఆర్ ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో కడప స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తుండగా, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కాకినాడ నుంచి పళ్లంరాజు, బాపట్ల ఎస్సీ స్థానం నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి పీజీ పుల్లయ్య యాదవ్‌లను అభ్యర్థులుగా ప్రకటించారు. 
 
అయితే, ఇపుడు కడప లోక్‌సభ స్థానంపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానంలో ఇప్పటికే అధికార వైకాపా నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పేరును ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీకి దింపిన విషయంతెల్సిందే. ఇపుడు తన సొంత చెల్లి వైఎస్ షర్మిల పోటీకి దిగడంతో వైకాపా కుటుంబ సభ్యులతో పాటు కడప ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్న ఆసక్తినెలకొంది. అదేసమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోవడమేకాకుండా, ఎనిమిదో నిందితుడుగా ఉంటూ బెయిల్‌పై బయటతిరుగుతున్న అవినాశ్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, 175 అసెంబ్లీ సీట్లకుగాను, కాంగ్రెస్ పార్టీ 114స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో వైకాపాకు రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలిజా (చింతలపూడి), ఆర్థర్ (నందికొట్కూరు)లకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు కేటాయించింది.