శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (10:24 IST)

ఎవరెలా చస్తే నాకేంటి? అనే టైప్ ముఖ్యమంత్రి జగన్

ప్రజారోగ్యంతో జగన్మోహన్ రెడ్డి చెలగాటం ఆడుతున్నార‌ని, అధోగతిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంద‌ని, కరోనా టీకా పంపిణీలో అట్టడుగు స్థానం అని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన‌ సత్యనారాయణ రాజు విమ‌ర్శించారు. ఎవరెలా చస్తే నాకేంటి అనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలితో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింద‌న్నారు. రాజకీయ ప్రయోజనాలు,  ప్రత్యర్థులను వేధించడంపైనే ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్నార‌ని, రోజువారీ కరోనా కేసుల పెరుగుదలలో ఏపీని దేశంలోనే 3వ స్థానంలో నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి, వ్యాక్సిన్ పంపిణీలో చివరి స్థానంలో నిలపడం సిగ్గుచేట‌న్నారు. 
 
దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ ప్రభుత్వం అత్యధిక జనాభాలో 75 శాతం మందికి, కర్నాటకలో 70 శాతం, తెలంగాణలో 62 శాతం పైగా వ్యాక్సినేషన్ పూర్తికాగా మన రాష్ట్రంలో కేవలం 41 శాతమే టీకా పంపిణీ పూర్తి చేయడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోంది. పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని కేంద్రం, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా, వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడం లేద‌ని పేర్కొన్నారు.  కోవిడ్ రెస్పాన్స్ ప్లానింగ్ పేరుతో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులతో 14 జిల్లా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం, ఆ దిశగా చర్యలెందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాల‌ని మంతెన డిమాండు చేశారు. 
 
కరోనాతో అప్రమత్తమైన ఇతర రాష్ట్రాలు ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టగా, మన రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, విధ్వంసం సృష్టించార‌ని ఆరోపించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం పైసా ఖర్చు చేయ లేదు. ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు లేరు. వెంటిలేటర్లు లేవు. అత్యవసర పరికరాలు అందుబాటులో లేవు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను వైద్య సేవలకు వాడుకుని జీతాలు ఇవ్వాల్సి వచ్చేసరికి, కూరలో కరివేపాకులా తీసిపడేశారు. వేతనాల కోసం వారు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తున్నా కనికరించకపోగా వారిపై లాఠీచార్జ్ చేయించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని మంతెన అన్నారు. ఇదేనా వారియర్స్ కు ప్రభుత్వం ఇచ్చే గౌరవం? ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయలు కల్పించాలి. వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాల‌ని మంతెన సత్యనారాయణ రాజు సూచించారు.