శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జులై 2019 (08:15 IST)

మూడో రోజుకు చేరిన 108 సమ్మె

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది చేపట్టిన సమ్మె గురువారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ లోని సిఐటియు అనుబంధమైన  108 కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు బల్లి కిరణ్ కుమార్ నేతృత్వంలో గాంధీనగర్లోని వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 439 అంబులెన్సులు పనిచేస్తున్నాయని, 2300 మంది కార్మికులు పనిచేస్తున్నారని, గత ఆరు నెలలుగా వేతనాలు లేక నరక యాతన అనుభవిస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. పాత బిల్లులు పిఎఫ్ సెటిల్మెంట్ కూడా చేయలేదని, ఈ విషయమై ఎమ్మెల్యేలను డి ఎం హెచ్ కలెక్టర్లను అందరినీ కలిసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇ తమ పాదయాత్రలో భాగంగా 262 రోజున 108 ఉద్యోగుల భవిష్యత్తును చూస్తామని వారికి అండగా ఉంటామని, చెప్పినట్టు గుర్తు చేశారు. మేము పిల్లలకి భోజనం కూడా పెట్టే పరిస్థితి లేదని, ఫీజులు కట్టలేక పోతున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించి ఆందోళనను విరమింపజేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి తమకు భరోసా ఇస్తే వెంటనే సమ్మె విరమిస్తామని పేర్కొన్నారు.