అయోధ్యలో 100 గదులతో వసతి గృహం ఏర్పాటు చేయాలి జగన్ గారు: రఘురామకృష్ణ రాజు
నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కె. రఘురామకృష్ణ రాజు ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు. లేఖ లోని ముఖ్యంశాలు పరిశీలిస్తే... రామభక్తుల వసతి కోసం అయోధ్యలో ప్రత్యేక వసతి గృహాలు టీటీడీ నిర్మించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి అన్నారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తయిన తరువాత శ్రీ రామచంద్రుడిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలామంది రామభక్తులు అయోధ్య సందర్శిస్తారు. వారి సౌకర్యం కోసం టీటీడీ 100 గదులతో వసతి గృహం నిర్మించాలి.
అయోధ్యలో వసతి గృహాలు, కల్యాణమండపం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణాలు కోసం మూడు ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి అని కోరారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భూమి కేటాయించకపోతే టీటీడీ భూమి కొనుగోలు చేసి అయినా వసతి గృహాలు, కల్యాణమండపం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణాలు చేపట్టాలన్నారు.
అయోధ్యలో టీటీడీ నిర్మించతలపెట్టిన వసతి గృహాలు భక్తుల భాగస్వామ్యంతో నిర్మించవచ్చు. దీనివల్ల టీటీడీకి ఆర్ధిక భారం పడదు.
అయోధ్యలో వసతి గృహం, కల్యాణ మండపం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని కోరుతూ ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడానికి కేబినెట్ మంత్రులతో, ఉన్నత అధికారులతో, టీటీడీ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చెయ్యాలి.
హైదరాబాద్, చెన్నై, టీటీడీ నిర్మించిన విధంగా అయోధ్యలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, వసతి గృహాలు, కల్యాణమండపం నిర్మించాలని అన్నారు.