మనవళ్లు వచ్చారన్న ఆనందం: మసాలా అనుకుని పురుగు మందును చికెన్‌లో కలిపేసిన అమ్మమ్మ
చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన మనవళ్లు ఇంటికి వచ్చారన్న ఆనందంలో ఓ అమ్మమ్మ పొరబాటున చికెన్ మసాలా అనుకుని పురుగుల మందు ప్యాకెట్ పొడిని చికెన్ కూరలో వేయడంతో ఆ కూరను తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా చెర్లపల్లి గ్రామంలో నివాసం వుంటోంది వృద్ధురాలు గోవిందమ్మ. ఆమె కుమార్తె ధనమ్మ ఎ.ఎల్ పురంలో వుంటోంది. చాలా కాలంగా కరోనా లాక్ డౌన్‌తో ఎవరి ఇళ్లకు వాళ్లే పరిమితమయ్యారు. ఐతే ధనమ్మ తన ఇద్దరు కుమారులను తీసుకుని తల్లి ఇంటికి వచ్చింది. మనవళ్లను చూసిన గోవిందమ్మ, వారికి చికెన్ వండిపెట్టాలనుకుంది.
చికెన్ తెప్పించి కూర వండుతూ అందులో మసాలా వేసే సమయంలో పొరబాటున పురుగుల మందు ప్యాకెట్టును గరంమసాలా అనుకుని కూరలో కలిపేసింది. ఆ కూరను తిన్న ఇద్దరు పిల్లలు, గోవిందమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఐతే అప్పటికే చిన్నారులిద్దరూ మృతి చెందారు. గోవిందమ్మ పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.