సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 8 మే 2019 (18:58 IST)

ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను గెంటేసి పరారైన భర్త-అత్త

ఆధునిక సమాజంలోను కొడుకు, కూతురు తేడా చూపిస్తున్నారు కొందరు. కుమారుడైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కుమార్తె అయితే డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అనుకుంటున్నారు కొంతమంది. అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఉదంతం బయటపడింది. కర్నూలు జిల్లా స్వామిరెడ్డినగర్‌కు చెందిన అబ్ధుల్ మాజిత్ అనే వ్యక్తి తన భార్యకు ఆడపిల్లలే పుడుతున్నారనే కోపంతో భార్యను ఇంటి నుంచి బయటకు తరిమేశాడు.
 
అబ్ధుల్ మాజిత్, గౌసియాలకు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. మొదటి సంతానం ఆడపిల్ల. రెండవ సంతానం కూడా ఆడపిల్లే. దీంతో గత 7 నెలల నుంచి భార్య గౌసియాను అబ్ధుల్ మాజిత్, అత్త నిలోఫర్‌లు వేధిస్తూ వచ్చారు. అత్తతో పాటు భర్త పెట్టిన బాధలను తట్టుకుంది గౌసియా. అయితే గత రెండురోజుల ముందు ఇద్దరూ చిత్రహింసలకు గురిచేసి గౌసియాను ఇంటి నుంచి పిల్లలతో సహా బయటకు గెంటేశారు. 
 
ఆ తరువాత ఇంటికి తాళాలు వేసి ఇద్దరూ కనబడకుండా ఎటో వెళ్లిపోయారు. దీంతో గౌసియా తనకు న్యాయం కావాలంటూ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అబ్ధుల్ మాజిత్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో పాటు బంధువుల ఇళ్ళలో ఎక్కడా లేకపోవడంతో పోలీసులు అతనితో పాటు నిలోఫర్ కోసం వెతుకుతున్నారు.