1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:19 IST)

తిరుమలలో దళారీలు జాగ్రత్త.. శీఘ్ర దర్శన టికెట్లని అలా మోసం చేశారు

lord venkateswara swamy
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో దళారీలు భక్తులను మోసం చేస్తున్నారు. ఉచిత సర్వదర్శన టోకెన్లను దళారీలు రూ.300ల శీఘ్ర దర్శన టికెట్లుగా భక్తులకు అంటగట్టారు. 
 
వివరాల్లోకి వెళితే..  మార్చి 30న గుంతకల్ కు చెందిన కొందరు భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. అయితే సర్వదర్శనంలో దర్శనం ఆలస్యం అవుతుందని భావించిన భక్తులు.. శీఘ్ర దర్శన టోకెన్ల కోసం స్థానిక దళారీని ఆశ్రయించారు. 
 
ఈక్రమంలో దళారి కిరణ్ కుమార్ వారికి ఉచిత సర్వదర్శన టోకెన్లు ఇప్పించి..అవి రూ.300 విలువ చేసే శీఘ్ర దర్శన టోకెన్లుగా నమ్మించాడు. అంతే కాదు ఈ టోకెన్లతో ప్రత్యేక ప్రవేశద్వారం దర్శనం కల్పిస్తున్నామంటూ అదనంగా మరో రూ.200 భక్తుల నుంచి నొక్కేసాడు కిరణ్ కుమార్. 
 
ఇక శీఘ్ర దర్శన టోకెన్లు తీసుకున్న భక్తులు క్యూ కాంప్లెక్స్ లో రూ.300 ప్రవేశ ద్వారా వెళ్తుండగా..సిబ్బంది అవి సర్వదర్శన టోకెన్లు అంటూ వారించారు. దీంతో మోసపోయామని గ్రహించిన భక్తులు అక్కడే టీటీడీ విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై టీటీడీ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న తిరుపతి టూ టౌన్ పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.