శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (17:36 IST)

ఎక్స్‌ సర్వీస్‌మెన్ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయించండి..

ఆంధ్రా సబ్ ఏరియా డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర బుధవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర మాట్లాడుతూ ఎక్స్‌ సర్వీస్‌మెన్ ఆసుపత్రి(పాలిక్లినిక్)నిర్మాణానికి కృష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడ సమీపంలో మచిలీపట్నం జాతీయ రహదారి మార్గంలో స్థలం కేటాయించాలని సిఎస్‌కు విజ్ణప్తి చేశారు.
 
అలాగే సైనిక్ ఆరామ్ అతిధిగృహం (Rest House)నిర్మాణానికి కూడా తగిన స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఈ పాలిక్లినిక్ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్‌ను కోరారు. 
 
ఎక్స్ సర్వీస్‌మెన్ ఆసుపత్రి కరెంట్ బిల్లుల విషయాన్ని కూడా బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర సిఎస్ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఆర్మెడ్ ఫోర్సెస్‌కు చెందిన నాగిరెడ్డి, గోవిందరెడ్డిలకు సంబంధించిన ఇళ్ళకు నష్టం కలిగించిన వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సిఎస్ దృష్టికి తెచ్చారు.
 
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్‌మెన్ ఆసుపత్రి నిర్మాణ పనులను పోలీస్ హౌసింగ్ నిర్మాణ సంస్థ ద్వారా చేపట్టే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 
ఇందుకు సంబందించి వెంటనే తగిన ప్రతిపాదనలను ఇవ్వాలని బ్రిగేడియర్ అభిజిత్ చంద్రకు సిఎస్ సూచించారు.నరసరావుపేట వద్ద ఆర్మడ్ ఫోర్సెస్ కు చెందిన సిబ్బంది ఇళ్లకు నష్టం కలిగించిన వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా  జిల్లా కలక్టర్ కు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు.ఆంధ్రా సబ్ ఏరియా ప్రాంతంలో మాజీ సైనికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను సిఎస్ ఆదిత్యానాద్ దాస్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్రను అడిగి తెల్సుకున్నారు.
 
అనంతరం ఆంధ్రా సబ్ ఏరియా తరుపున సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అభిజిత్ చంద్ర జ్ణాపికలను అందించారు.
 ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు(పబ్లిక్ అఫైర్స్) సజ్జల రామకృష్ణా రెడ్డి, కల్నల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.