ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (17:52 IST)

'అమ్మ ఒడి'పై మాట తప్పిన జగన్‌: అచ్చెన్నాయుడు ఆగ్రహం

'రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో బడికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్ధికి అమ్మ ఒడి పధకాన్ని ఇస్తామని మాట ఇచ్చారు. మ్యానిఫెస్టోలో పిల్లలందరిని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15వేలు ఇస్తామని హామీనిచ్చారు. తీరా అమలులో మాత్రం అమ్మ ఒడి పధకాన్ని పిల్లలందరికి వర్తింపజేయకుండా మాటతప్పారు, మడమ తిప్పారు' అని శాసనసభాపక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఈ మేర‌కు టీడీపి పార్టీ కార్యాల‌యం నుంచి గురువారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అధికారంలోకి రాక ముందు చదువుకునే ప్రతి పిల్లవాడికి ఈ పథకాన్ని అమలు చేస్తానన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం ప్రభుత్వం పాఠశాలలో చదువుకునే వారికే అన్నారు. ఆ తరువాత ఇంటిలో కేవలం ఒక్క విద్యార్ధికే అన్నారు.

ఇప్పుడు రేషన్‌ కార్డు ఉన్న వారే అర్హులు, 300 యూనిట్లు దాటిన వారికి వర్తించదు, టాక్స్‌ కడుతున్న వారికి వర్తించదు, గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.20 లక్షలు, పట్ణణాల్లో రూ.1.44 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు ఇలా అమ్మ ఒడిని అనేక ఆంక్షల సుడిగా మార్చారు.

ఈ పథకం తీరు తెలియకా ప్రజలు మల్లగుల్లాలు పడుతున్నారు. అదే విధంగా 1 నుండి ఇంటర్మీడియట్‌ వరకు అమలు చేస్తామన్నారు కాని తత్సానమైన ఐటీఐ, డిప్లమో, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు ఎందుకు అమలు చేయడం లేదు? పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అమ్మ ఒడిని అమలు చేస్తామని నవంబర్‌ 11, 2019న జారీ చేసిన జీవో నెం.79లో సుస్పష్టంగా ఉంది.

దీని ప్రకారం 82 లక్షల మంది విద్యార్దులకు గాను కేవలం 43 లక్షల మంది విద్యార్ధులకు ఇవ్వడం జగన్మోహన్‌రెడ్డి మాట తప్పడం, మడమ తిప్పడం కాదా? 1వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు పిల్లలను తల్లులు బడికి పంపించండి.

ఒక్కో పిల్లవాడికి నెలకు రూ.500 చొప్పున ఇద్దరికి రూ.1000, 6 నుంచి 10 వ తరగతి వరకు ఒక్కో పిల్లవాడికి రూ. 750 చొప్పున ఇద్దరికి నెలనెలా రూ.1500, ఇంటర్మీడియట్‌ పిల్లలకు నెలకు రూ. 1000 చొప్పున ఇద్దరికి రూ. 2 వేలు ఇస్తాను అని ప్రతిపక్ష నేతగా జగన్‌ జూలై  08, 2017న గుంటూరులో జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశంలో జగన్‌ ప్రకటించారు.

ఈ లెక్కన 1 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న పిల్లలకు సంబందించి ఒక్కో తల్లికి సంవత్సరానికి రూ. 12 వేలు,  6 నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న  పిల్లలకు సంబందించి ఒక్కో తల్లికి సంవత్సరానికి రూ 18 వేలు, ఇంటర్మీడియట్‌  చదువుతున్న ఒక్కో విద్యార్ధి తల్లికి సం|| రూ. 24 వేలు చెల్లించాలి. 2019-20 బడ్జెట్‌లో కేవలం రూ. 6,445 కోట్లు మాత్రమే కేటాయించారు.

సాధారణంగా ప్రభుత్వం ఏదైనా కొత్త పధకాన్ని ప్రారంభిస్తే నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తారు. కాని అమ్మ ఒడి పధకానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను మళ్లించి ఈ పధకానికి ఖర్చు చేయడం వెనుకబడిన వర్గాల పొట్టకొట్టడమే అవుతుంద‌న్నారు.