1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మే 2024 (13:38 IST)

విదేశాల్లో విహరిస్తున్న తెలుగు రాజకీయ ప్రముఖులు

ys sharmila
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైకాపా, విపక్ష తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు విశ్రాంతి కోసం విహార యాత్రలకు బయలుదేరి వెళ్లారు. 
 
ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన భారతీ రెడ్డిని వెంటబెట్టుకుని లండన్ పర్యటనకు వెళ్లారు. అలాగే, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి అమెరికాకు వెళ్లారు. ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం ఈ నెల 16వ తేదీన అమెరికాకు తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. ఈయన ఈ నెల 25 లేదా 26వ తేదీన రాష్ట్రానికి తిరిగిరానున్నారు.
 
అయితే, చంద్రబాబు వైద్య పరీక్షల కోసం వెళ్లగా, లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెలను కలిసేందుకు జగన్ వెళ్లారు. జగన్ కూడా ఈ నెలాఖరులో తిరిగి ఏపీ చేరుకుంటారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా అమెరికా వెళ్లారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అక్కడే ఉన్న తల్లి వైఎస్ విజయమ్మను కలిసేందుకు వెళ్లారు.
 
కుమారుడు, తల్లితో కొంతకాలం గడిపిన తర్వాత తిరిగి జూన్ 2వ తేదీన తల్లితో కలిసి షర్మిల వెనక్కి వస్తారని సమాచారం. రెండుమూడు నెలలుగా ఎన్నికల ప్రచారం, వ్యూహాలతో బిజీబిజీగా గడిపిన వీరంతా ఎన్నికలు ముగిసీ ముగియగానే విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, అంతకుముందే వీరంతా ఏపీకి చేరుకుంటారు.