గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (17:14 IST)

అంబేద్కర్ స్మృతివనం హైలెట్స్ ఏంటి? రూ.170 కోట్లతో ప్రారంభిస్తే రూ.404 కోట్లకు చేరింది!!

AmbedkarSmritiVanam
విజయవాడ నగరంలో అధికార వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్మృతివనం ప్రాజెక్టును చేపట్టింది. దీన్ని హైదరాబాద్ నగరానికి చెందిన కేపీసీ ప్రాజెక్టు లిమిటెడ్ పూర్తి చేసింది. 2021 డిసెంబరు నెలలో 18 ఎకరా విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభించంగా రెండేళ్లలో నిర్మాణ పనులను పూర్తి చేశారు. అయితే, ఆరంభంలో రూ.170 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టగా, ఇది పూర్తయ్యే నాటికి రూ.404.35 కోట్లకు చేరింది. 
 
సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ్లలో నడిచేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్‌లను నిర్మించారు. ఇకపై ఈ ప్రాంతాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో అంబేద్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, 2 వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. అలాగే, ఫుడ్ కోర్టు, పిల్లల కోసం ఆటస్థలం, మ్యూజికల్ ఫౌంటేన్, నీటి కొలన్లు ఉన్నాయి. 
 
స్మృతివనంలో ఆవిష్కరించిన విగ్రహం తయారీలో 400 టన్నుల స్టీల్, 120 టన్నుల కాంస్యం ఉపయోగించారు. విగ్రహ పీఠాన్ని బౌద్ధ వాస్తుశిల్పం కాలచక్ర మహామండలంగా తీర్చిదిద్దారు. విగ్రహ బరువును తట్టుకునేందుకు భవనం పునాదులను పైల్ ఫౌండేషన్‌తో 30 మీటర్ల పైల్స్‌తో నిర్మించారు.
 
విగ్రహపీఠం ఉన్న పెడెస్టల్ భవనం మొత్తాన్ని రాజస్థాన్ పింక్ ఇసుకరాయితో తాపడం చేశారు. 95 ఫోర్ వీలర్లు, 84 ద్విచక్ర వాహనాలు ఒకేసారి నిలుపుకునేలా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు 600 మంది కార్మికులు నిరంతరం పనిచేశారు.