గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మార్చి 2020 (10:03 IST)

నా తండ్రిని కడసారి చూపు చూస్తా.. రక్షణ కల్పించండి ప్లీజ్... ఖాకీలకు అమృత

హైదరాబాద్ నగరంలోని ఆర్యవైశ్య సత్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్ హత్య కేసులోని నిందితుడు మారుతీ రావు కుమార్తె అమృత మీడియా ముందుకు వచ్చింది. తన భర్తను చంపిన కేసులో నిందితుడు అయినప్పటికీ ఆయన తన కన్నతండ్రి అని, అందువల్ల ఆయన్ను కడసారి చూపు చూస్తానని చెప్పింది. ఇందుకోసం పోలీసులు తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. 
 
ఈ మేరకు ఆమె మిర్యాలగూడ అధికారులకు సమాచారాన్ని పంపింది. తన తండ్రిని చూడాలని భావిస్తున్నానని, అక్కడికి వెళితే, తనపై దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాలని ఆమె కోరడంతో పోలీసులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమృత రావాలని అనుకుంటున్న విషయాన్ని మారుతీరావు దగ్గరి బంధువులకు తెలియజేస్తామని, వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని పోలీసులు అభిప్రాయపడ్డారు. 
 
మరోవైపు, తన తండ్రి అంత్యక్రియలకు వస్తానని అమృత చేసిన విజ్ఞప్తిపై ఇప్పటివరకూ ఆమె తల్లి స్పందించలేదని తెలుస్తోంది. తన కుటుంబం ఇలా కావడానికి కారణం అమృతేనన్న కోపంతో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే కుమార్తె అభ్యర్థనపై తల్లి స్పందించలేదు. ఇదేసమయంలో అమృత వచ్చేందుకు ఆమె బాబాయ్ అంగీకరించడం లేదన్న వార్తలు కూడా వినొస్తున్నాయి. ఆమె వస్తే, తన సోదరుడి ఆత్మశాంతించబోదని ఆయన అన్నట్టు తెలుస్తోంది.
 
కాగా, అమృత ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో, ఆమె భర్త ప్రణయ్‌ని 2018లో మారుతీ రావు కిరాయి హంతకులతో అతి దారుణంగా హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు, హైదరాబాద్‌లోని, వైశ్య భవన్‌లోని ఓ గదిలో గారెల్లో విషం కలుపుకుని తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం మిర్యాలగూడలో జరుగనున్నాయి.