ఆదివారం, 23 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

shiva jyothi
తిరుమల శ్రీవారి ప్రసాదంపై ప్రముఖ టీవీ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. రిచెస్ట్ బెగ్గర్సం శ్రీవారి అన్నప్రసాదాల కోసం క్యూలైన్లలో ఉన్నామంటూ కామెంట్స్ చేశారు. పైగా నవ్వుతూ కామెంట్స్ చేయడంతో శ్రీవారి భక్తులు ఆమెపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాట్లపై నెటిజన్లు సైతం తీవ్ర విమర్శలు, ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో ఆమె దిగివచ్చి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. భేషరతుగా అందరికీ క్షమాపణలు చెప్పారు. 
 
ఇటీవల తిరుపతి దర్శనం, ప్రసాదం గురించి శివజ్యోతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆమె, తన తప్పును అంగీకరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు.  'పొద్దున్నుంచీ తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందిని బాధించాయి. వివరణ ఇచ్చే ముందు హర్ట్ అయిన ప్రతి ఒక్కరికీ సారీ చెబుతున్నాను' అని ఆమె పేర్కొన్నారు.
 
తాము రూ.10,000 ఖరీదైన ఎల్1 క్యూలైనులో వెళ్లామని, ఆ ఉద్దేశంతోనే ఖరీదైన లైన్ అని అన్నానని, అంతేకానీ 'మేము ధనవంతులం' అనే అహంకారంతో కాదని ఆమె స్పష్టతనిచ్చారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి అని, నాలుగు నెలలుగా శనివారం వ్రతాలు కూడా చేస్తున్నానని తెలిపారు. 
 
'నాకు అత్యంత విలువైన నా బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామే ఇచ్చాడు. అలాంటిది ఆయన గురించి నేనెలా తప్పుగా మాట్లాడతాను?' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 'నా ఉద్దేశం అది కాకపోయినా, నా మాటలు తప్పుగా ఉన్న మాట వాస్తవం. యూట్యూబ్ ఛానెళ్లు, కేసుల భయంతో కాకుండా, అలా మాట్లాడి ఉండకూడదని నాకే అనిపించింది. అందుకే క్షమాపణ కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు పునరావృతం కాదు' అని శివజ్యోతి స్పష్టం చేశారు. ఆమె క్షమాపణతో ఈ వివాదం సద్దుమణిగినట్లేనని భావిస్తున్నారు.