శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 12 అక్టోబరు 2021 (13:53 IST)

బ్రాహ్మ‌ణ సంఘాల్లో లుక‌లుక‌లు... మాజీ ఛైర్మ‌న్ ఆనంద్ సూర్య‌కు స‌వాల్!

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మంగళవారం మీడియా సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్యకు బహిరంగ సవాల్ విసిరారు. బీసీ జాబితాలోకి బ్రాహ్మణులను చేర్చాలనే ప్రతిపాదనలు 2017 ఆగస్ట్ 18న  గెజిట్ చేసింద‌ని తెలిపారు. ఇది  టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మీరు డైరెక్టర్ల‌తో తీర్మానం చేసి పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
 
టీడీపీ కార్యాలయంలో ఆమరణ నిరాహారదీక్ష ఎవరి స్వార్ధం కోసం చేస్తున్నావ‌ని ఆనంద్ సూర్య‌ను సూటిగా ప్ర‌శ్నించారు. త‌ను బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మన్ గా పని చేసే రోజుల్లో బ్రాహ్మణ సంఘాలతో కలసి పని చేయలేకపోయాడ‌ని, ఇపుడు షుగరు, బీబీ ధారాళంగా పెట్టుకొని దీక్షలు చేస్తాను అంటే నమ్మి జాలిపడే స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణులు లేరని విమ‌ర్శించారు. 
 
బ్రాహ్మణ జాతి అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఐతే టీడీపీ కార్యాలయంలో దీక్షలు ఏంట‌ని ప్ర‌శ్నిస్తూ, పార్టీలు, జెండాలు పక్కన పెట్టిరా, అపుడు న‌మ్ముతామ‌ని స‌వాలు విసిరారు. 34 ఏళ్లలో టీడీపీలో ఒక్కరికి కూడా బ్రాహ్మ‌ణుల‌కు ఎమ్మెల్యే కానీ ఎంఎల్ సి సీట్ కూడా ఇవ్వలేద‌ని, అప్పుడు గుర్తుకు రాలేదా? బ్రాహ్మణ జాతి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయాలని అనిపించ లేదా అని ఆనంద్ సూర్యను కోనేరు స‌తీష్ శ‌ర్మ నిల‌దీశారు.
 
అర్చకులకు వంశపారంపర్య అర్చకత్వానికి జీవో ఇప్పిస్తానని చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించి బ్రాహ్మణ జాతిని అవమానపరిచిన విష‌యం మీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. చైర్మన్ గా నువ్వు ఉన్న సమయంలో కార్ల కుంభకోణం వాస్తవం కాదా? కార్పొరేషన్ లో పథకాలు రావాలంటే పచ్చ కండువా వేసుకోవాలి అన్న నీ మాటలు నిజం కాదా? బ్రాహ్మణ జాతికి మేలు చేయాలనుకొంటే రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేద్దాం... నువ్వు పార్టీ జెండాలు పక్కన పెట్టి రాగలవా అని ప్ర‌శ్నించారు. 
 
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆహ్వానించిన సభలకు రాకుండా, వైసీపీకి సపోర్టుగా పని చేస్తున్నారంటూ, మొహం చాటేసిన నువ్వు కాదా! మీతో పాటు ఉన్న డైరెక్టర్ల‌ను కూడా వెళ్లవద్దు అని చెప్పింది నిజం కాదా? టీడీపీ అనుబంధ సంఘాల పేరిట బ్రాహ్మణులలో చీలికలు పెట్టింది మీరే కదా ఆనంద్ సూర్య అంటూ నిల‌దీశారు. 
 
మీ పార్టీలో పనిచేస్తున్న బ్రాహ్మణ నాయకులే ఒకటిగా లేరు? మీరు బ్రాహ్మణ జాతి కోసం ఆమరణ నిరాహారదీక్ష అంటే సమాజం నవ్వుకొంటుంది. చంద్రబాబు నాయుడుకు పాదాభివందనం చేసిన రోజే బ్రాహ్మణ జాతి ఆత్మ గౌరవానికి మీరు తూట్లు పొడిచారు. ఆ సన్నివేశాలు బ్రాహ్మణులు మరచిపోయారని అనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం అని అన్నారు.
 
జగన్ ప్రభుత్వం లో వంశపారంపర్య అర్చకత్వం జీవో ఇచ్చి, రూల్స్ ఫ్రెమ్ చేశార‌ని, అర్చకులకు జీతాలు పెంచార‌ని, కనకదుర్గ గుడికి 70 కోట్లు కేటాయించార‌ని చెప్పారు. చట్టసభల్లో అవకాశం కల్పించార‌ని, టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను వాడుకొని వదిలేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బడెకర్ అనుపమ నాగరాజు, తెలికేపల్లి వెంకటేశ్వర్లు, మన్నెపల్లి హనుమంతు శర్మ తదితరులు పాల్గొన్నారు.