మా - రెండుగా చీలిపోతుందా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నాగబాబు సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో రాత్రికి రాత్రే నాగబాబు తాను `మా` సభ్యుడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు అదేబాటలో ప్రకాష్‌రాజ్ కూడా ప్రకటించాడు. మా సభ్యుడి కాకపోయినా నటించవచ్చుగదా అనే లాజిక్‌ను ఆయన మాట్లాడాడు. మరి 900 పైగా వున్న సభ్యులంతా లక్షరూపాయల సభ్యత్వరుసుం తీసుకొని మా సభ్యులుగా ఎందుకు మారారు. మరి మీరు కూడా అలాగే చేసినవారేకదా? అనే ప్రశ్నకు ప్రకాష్‌రాజ్ నుంచి సరైన సమాధానం లేదు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగబాబు అన్నమాటలలో `మా మసకబారింది` అనే మాటకు ఆయన వర్గం కట్టుబడివుంది. దాని పర్యవసనం ఏమంటే, మా మసకబారలేదు. బీటలువారింది అని ఇండస్ట్రీ వర్గాలో టాక్ నెలకొంది. ఇప్పుడు జరిగిన ఎన్నికలు రెండు వర్గాల పోరుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
నాగబాబు, ప్రకాష్‌రాజ్ రాజీనామాలు చేయకుముందే అంటే ఎన్నికలకుముందే బండ్ల గణేష్ ఓ మాటనుకూడా అన్నాడు. మా లో మరోగ్రూపు వుంటే ఏమవుతుంది అని అన్యాపదేశంగా తెలియజేశాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో `మా` సంఘం ఏర్పాటైంది. వారంతా కలిసి ఎన్నిలకముందు ప్రకాష్‌రాజ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నట్లు ప్రకటించి ఆయన ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు.
సోమవారంనాడు ప్రకాష్‌రాజ్ మీడియా ముందుకు వచ్చి, తెలుగు వ్యక్తులకు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండే విధంగా బైలాస్ లో సవరణ చేస్తామని మంచు విష్ణు వర్గంప్రచారం చేసిందని, దానిని తాను స్వాగతించలేనని, ఇక మీద తెలుగు సినిమాలలో నటిస్తాను తప్పితే, మాలో సభ్యుడిగా ఉండనని తెలిపారు. అంతేకాదు అసలు కథ ఇప్పుడే మొదలైందని ఆయన సమావేశం చివరిలో వ్యాఖ్యానించారు.
ఈ మాటలు చాలా మందిని ఆలోచనలో పడేస్తున్నాయి. `మా` రెండు ముక్కలు అవుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాల్లో నటించే నటీనటుల మధ్య, నిర్మాతల మధ్య ఆర్థిక లావాదేవీల మధ్య తేడాలుంటే `మా`, ఛాంబర్ కలిసి పరిష్కరించేవి. ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారిందనే సూచనలు తెలియజేస్తున్నాయి.
మాకు వ్యతిరేకంగా ఏదైనా కొత్త అసోసియేషన్ ను ఏర్పాటు చేయబోతోందా? అన్న ప్రశ్నను ఆయన ఖండించారు. అంతా ఒక కుటుంబం, మా సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తాం- అన్న నాగబాబు అండ్ కో వర్గం ఏమని సమాధానం చెబుతుందో అర్థంకావడంలేదు. కొందరి ఇగోల వల్ల `మా` నిర్వీర్యం అయ్యేందుకు ఎంతోదూరం లేదని తెలుస్తోంది. అందుకే మా బీటలు బారలేదు. రెండుగా విడిపోతుందనేది నాగబాబు మాటల్లో అంతరార్థం అని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
ఇదంతా రాజకీయ పార్టీల చర్యలను తలపిస్తుందని సీనియర్ `మా` సభ్యులు తెలియజేస్తున్నారు. ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే మరో పార్టీ తీర్థం తీసుకోవడం మామూలే. పార్టీలో సెకండ్‌గ్రేడ్ వున్న వ్యక్తిని దూరం చేస్తే అతను ఏవిధంగా కొత్త పార్టీ పెడతాడో అదేవిధంగా `మా` తయారైందని వారు స్పష్టం చేస్తున్నారు.