1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (16:49 IST)

ఏపీలో భారీగా పెరగనున్న విద్యుత్ చార్జీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెరుగనున్నాయి. విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కింలు ప్రతిపాదించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13 విద్యుత్ శ్లాబులు ఉండగా, వీటిని ఆరు శ్లాబులుగా కుదించనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉండే శ్లాబులపై యూనిట్‌కు 20 పైసలు నుంచి రూ.1.40 పైసలు చొప్పున వడ్డించనున్నారు. 
 
ఈ పెంచిన కొత్త చార్జీలు ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త చార్జీలకు సంబంధించి ఈ నెల 30వ తేదీన ఏపీఈఆర్సీ ఉత్తర్వులను వెలువరించే అవకాశం ఉంది. అంటే జూలై వరకు పాత విద్యుత్ చార్జీలనే వసూలు చేస్తారు. ఆగస్టు నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, ఆగస్టు నుంచి ప్రతిపాదించిన చార్జీల టారిఫ్‌ను పరిశీలిస్తే, కేటగిరీ ఏ కింద 0 నుంచి 30 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ ఏ కింద 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 2.80 చొప్పున వసూలు చేస్తారు. 
 
కేటగిరీ బి కింద 0 నుంచి 100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు 4 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ బి కింద 101 నుంచి 200 వరకు యూనిట్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ బీ కింద 201 నుంచి 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తారు. 300 యూనిట్లకుపైగా ఒక్కో యూనిట్‌కు రూ.7.50 పైసలు చొప్పున వసూలు చేసేలా నిర్ణయించారు.