ఆపరేషన్ మదర్ టైగర్ 108 ఫెయిల్.. పెద్దపులి పట్టించుకోలేదు.. ఇక జూకు..?
నల్లమల అడవిలో ఆపరేషన్ మదర్ టైగర్ 108 ఫెయిల్ అయ్యింది. పిల్లికూనల వద్దకు పెద్దపులి రాలేదు. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముసలిమడుగు రేంజ్ దోమకుంట ప్రాంతంలో తల్లిపులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతానికి పులికూనలు ప్రత్యేక వాహనాల్లో పులి పిల్లలను తీసుకెళ్లారు. అలా అర్థరాత్రి నల్లమల అడవిలో గంటల తరబడి తల్లిపులి కోసం 92 గంటల పాటు ఎదురుచూశారు.
కానీ తల్లిపులి జాడే కనిపించలేదు. పిల్లల కోసం తల్లిపులి రాకపోవడంతో ఇక చేసేది లేక అధికారులు పులికూనలను తిరిగి ఆత్మకూరు క్యాంప్ ఆఫీసుకు తరలించారు. పాపం అమ్మపాలు తాగి అమ్మతో ఆడుకుంటూ వేట నేర్చుకోవాల్సిన పులి కూనలు అటవీశాఖ అధికారులు పెట్టింది తిని జీవిస్తున్నాయి.
ముసలిమడుగు గ్రామం అడవిముక్కల ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని ఓ గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో ఆ ప్రాంతంలో పెద్ద పులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి పెద్ద పులి పిల్లలను శ్రీనివాస్ నేతృత్వంలో తరలించినా తల్లిపులి పిల్లల దగ్గరకు రాకపోవటంతో అధికారులు యత్నిలు ఫలించకుండాపోయాయి.
సాధారణంగా మనుషుల స్పర్శ కలిగిన పులి కూనలను తల్లి దగ్గరకు రానివ్వదు. గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైన విషయాన్ని అటవీశాఖ అధికారులు గుర్తు చేసుకున్నారు. పిల్లలను తల్లి పులి మళ్లీ దగ్గరకు చేర్చుకోదని అనుకుంటున్నారు. ఈ కారణంతోనే.. జూకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు.