గురువారం, 23 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: బుధవారం, 2 నవంబరు 2022 (16:50 IST)

సీఎం జగన్ దర్శన భాగ్యం లభించలేదని మహిళ ఆత్మహత్యాయత్నం

woman suicide attempt
అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఓ మహిళ తన చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సీఎం జగన్‌ను కలిసేందుకు అధికారులు అనుమతించలేదని పేర్కొంటూ ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. తన కుమార్తె అచేతన స్థితిలో ఉందని సీఎంకు చెప్పేందుకు ఆ మహిళ చేసిన ప్రయత్నం విఫలం కావడంతో తీవ్ర క్షోభకు గురైన ఆమె చేతి మణికట్టుకుని కోసుంది. 
 
కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళ ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్ర వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం రూ.2 కోట్లు కావాలని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తన కుమార్తెను కాపాడాలని సీఎం జగన్‌ను వేడుకునేందుకు ఆమె సీఎం కార్యాలయం వద్దకు వచ్చారు. 
 
కనీసం లేచి నిలబడలేని కుమార్తెతో సహా అక్కడకు వచ్చిన ఆ మహిళ స్పందన కార్యక్రమంలో అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. కుమార్తె చికిత్స కోసం అన్నవరంలోని తమ ఇంటిని అమ్ముకోనివ్వకుండా మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్ మరో కానిస్టేబుల్‌తో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆమె ఆరోపిస్తుంది. అందువల్ల సీఎం జగన్‌ను కలిసే అవకాశం ఇవ్వాలని ఆమె ప్రాధేయపడింది. 
 
అయితే, సీఎం దర్శనభాగ్యం కలగలేదు. దీంతో ఇక తనకు న్యాయం జరగదని భావించిన ఆ మహిళ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిని కలవాలంటే ముందు ఎమ్మెల్యేలను కలవాలని చెబుతున్నారని, ఇక తమ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ ఓ బ్లేడుతో మణికట్టు వద్ద కోసుకుని కిందపడిపోయారు. వీల్ చెయిర్‌లో ఉన్న ఆమె కుమార్తె పరిస్థితి చూసి స్థానికులు చలించిపోయారు.